ఆంధ్రప్రదేశ్‌లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. వచ్చే వారం నుంచి ఆమె పర్యటన సాగనుంది. చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆవేదనతో మృతిచెందిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి కలిసి ఓదార్చనున్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు.
టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘నిజం గెలవాలి’ అనే పేరుతో ఆమె ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నట్లు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement Scam Case)లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బాబును అరెస్ట్ చేయడం వల్ల ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు.
వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన సాగనుంది. ఈ మేరకు టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా ఆమె మళ్లీ ప్రారంభించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు. అలాగే ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి పాదయాత్ర చేపట్టనున్నారు. అప్పటి వరకు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నారా లోకేశ్ నిర్వహిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.