మొన్న తిరుమల (Tirumala).. నిన్న యాదాద్రి (Yadadri) ఆలయాలపై డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టించగా.. తాజాగా మరోసారి శ్రీశైలం (Srisailam) ఆలయ సమీపంలో డ్రోన్ కెమెరాలు (Drone Camera) చక్కర్లు కొట్టాయి. నల్లమల్ల అభయారణ్యంలో కొలువుదీరరిన శ్రీశైలంలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఆలయం సమీపంలో డ్రోన్ కెమెరాలు తిరిగాయి. ఆర్టీసీ బస్టాండ్, కమ్మ సత్రం, బలిజ సత్రం వంటి చోట్ల ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు డ్రోన్ కెమెరాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
ఆలయంపై నుంచి వస్తువులు, విహంగాలు తిరగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం. అందుకే ఆలయాలపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు సంచరించవు. ఏపీలోని నంద్యాల జిల్లా (Nandyal District) శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆకాశంలో లైట్ తో కూడిన వస్తువులు తిరిగాయి. వీటిని గమనించిన భక్తులు ఆ తర్వాత డ్రోన్ కెమెరాలుగా గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆలయ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. డ్రోన్ ఎగురవేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, 2021 డిసెంబర్, జూలైలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం డ్రోన్ వ్యవహారంపై అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. డ్రోన్ జాడ కోసం వెతుకుతున్నారు.