»Tamil Nadu Vk Sasikala Comments On Aiadmk And Edappadi Palanisamy
తమిళ రాజకీయాలపై VK Sasikala సంచలన వ్యాఖ్యలు
వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న అసెంబ్లీని సినిమా థియేటర్ లా భావిస్తున్నారు. పళని స్వామి నా అపాయింట్ మెంట్ కోరితే తప్పనిసరిగా ఇస్తా అని శశికళ తెలిపారు. మళ్లీ ఏఐడీఎంకేను ఒక్కటి చేయాలని శశికళ భావిస్తున్నది.
తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో మళ్లీ శశికళ (Sasikala) రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆమె రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కులం చూసి ఉంటే ఎడప్పాడి పళని స్వామిని (Edappadi Palaniswami) ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొపెట్టే దానిని కాదని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr BR Ambedkar) జయంతి వేడుకలో పాల్గొన్న ఆమె అనంతరం విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈనెల 24వ తేదీన తిరుచ్చిలో పన్నీర్ సెల్వం (O Panneerselvam) నిర్వహించే మహాసభలో పాల్గొనే విషయంపై స్పష్టత ఇచ్చారు.
చెన్నైలోని (Chennai) టీ నగర్ (T Nagar)లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘నాకు కులమత, ప్రాంతీయ బేధాలు లేవు. కులం చూసి ఉంటే పళని స్వామిని సీఎంగా చేసేదానిని కాదు. పన్నీర్ సెల్వం మహాసభకు ఆహ్వానం పంపితే అందరికీ చెప్పకుండా వెళ్తానా? మీకు చెమొదట ఆహ్వానం రానివ్వండి. తర్వాత చూడండి. అందరికీ నన్ను అర్థం చేసుకునే కాలం వస్తుంది. అయితే ఇది ఓపీఎస్ ను ఉద్దేశించి మాత్రం కాదు. సాధారణంగా చెబుతున్నా అంతే. సివిల్ కోర్టుల్లో నిర్ణయాలు రాకుండా జారీ చేసే ఏ ఆదేశాలు కూడా శాశ్వతం కాదని సుప్రీంకోర్టు తెలిపింది’ అని శశికళ తెలిపారు.
‘మూడు దశాబ్దాల పాటు పాలించి ప్రజలకు మంచి పథకాలు అమలు చేసిన అన్నాడీఎంకేను (AIADMK) వివిధ కారణాల వల్ల విడిపోవడం దురదృష్టకరం. చీలిపోయిన వర్గాలు మళ్లీ ఒక్కటైతే మునుపటిలా అన్నాడీఎంకే బలం పుంజుకుంటుందనే భయంతో డీఎంకే (DMK) తెరవెనుక అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. మంచి పాలన అందిస్తారనే నమ్మకంతో ప్రజలు అధికారం ఇస్తే.. సీఎం స్టాలిన్ మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ సంతకు వెళ్లినట్టు అసెంబ్లీకి వెళ్తున్నారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న అసెంబ్లీని సినిమా థియేటర్ లా భావిస్తున్నారు. పళని స్వామి నా అపాయింట్ మెంట్ కోరితే తప్పనిసరిగా ఇస్తా’ అని శశికళ తెలిపారు. ఈ మాటలను బట్టి చూస్తే మళ్లీ పళనిస్వామిని తన వైపు తిప్పుకునేందుకు శశికళ ప్రణాళికలు వేస్తోందని తెలుస్తున్నది. మళ్లీ ఏఐడీఎంకేను ఒక్కటి చేయాలని శశికళ భావిస్తున్నది.