ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని, ప్రభుత్వం తమపై నిఘా ఉంచిందని ఆరోపించారు. తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తన ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నట్లు మాజీ ప్రొటెం స్పీకర్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
ఒంగోలు ఆదివారం నిర్వహించిన ఓ సమావేశంలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఫోన్లు రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ కు పాల్పడుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు వింటే తన ఫోన్ కూడా నిఘాలో ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు కూడా రావొచ్చని జోస్యం చెప్పారు. ఏపీలో సాధారణ ప్రజలకే కాదు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు తీవ్రమవుతోంది. సీఎం జగన్ చేస్తున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం.