ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు యామినీ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన మాటలు.. సీఎంగా అతడు చేస్తున్న పరిపాలనను ఉదాహరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ బాదుడే బాదుడు అని విమర్శించాడని.. ఇప్పుడు సీఎంగా జగన్ గుంజుడే గుంజుడు కార్యక్రమం ప్రారంభించాడని ఎద్దేవా చేశారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కేంద్ర బడ్జెట్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘కేంద్ర బడ్జెట్ పై కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా అనవసర విమర్శలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో సీఎం జగన్ విఫలమయ్యాడు. గతంలో టీడీపీ, ప్రస్తుతం వైసీపీ కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తమ పేర్లు పెట్టుకుని పాలన సాగిస్తున్నాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మరుగుదొడ్లపై, చెత్తపై పన్ను విధించడం దారుణం’ అని యామినీ శర్మ సీఎం జగన్ పాలనపై విమర్శలు చేశారు.