మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆలస్యానికి కారణం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలిపాడు. ఆయన తలచుకుని ఉంటే హత్య కేసు పది రోజుల్లోనే తేలిపోయేదని స్పష్టం చేశాడు. తాను చెప్పిందే జరుగుతోందని.. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. కడప సెంట్రల్ జైల్లో సీబీఐ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో దస్తగిరి మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘త్వరలో నిజాలు బయటకు వస్తాయి. అన్ని విషయాలు నిగ్గు తేలుతాయి. ఇప్పటివరకు నేను చెప్పింది అబద్ధమన్నారు. అబద్ధమైతే కేసు ఇంతవరకు ఎందుకు కొనసాగుతుంది? ఈ కేసు హైదరాబాద్ కు బదిలీ కావడం శుభ పరిణామం. నేను వేసిన ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు వస్తాయి. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతోనే విచారణకు పలువురిని పిలుస్తున్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏమిటనేది సీబీఐ త్వరలోనే బయట పెడుతుందని విశ్వసిస్తున్నా. అన్ని విషయాలు న్యాయస్థానంలో చెబుతా. ఈ కేసులో వాస్తవాల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు’ అని దస్తగిరి చెప్పేసి వెళ్లిపోయాడు.