మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని శివచరణ్ రెడ్డి నీడలా వెంటాడుతున్నాడు. నాన్నా.. నేను ఎవరినీ అని అడుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు దూరం పెట్టావు.. 18 ఏళ్ల నుంచి రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నాడు. నీ ఆస్తి, నీ అంతస్తు, రాజకీయ వారసత్వం అవసరం లేదు. కానీ ఒక కొడుకుగా గుర్తించు అని దీనంగా అడుగుతున్నారు. లేదంటే డీఎన్ఏ టెస్ట్‌కు వెళదాం అంటూ సవాల్ విసురుతున్నాడు. శివచరణ్ రెడ్డి లేఖ వదిలినా, మరోసారి మీడియా ముందుకు వచ్చినా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం మౌనం వీడటం లేదు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఓ ఇంటర్వ్యూలో తనకు కొడుకులు లేరని చెప్పడమే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన తప్పయిపోయింది. దీంతో శివచరణ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అతని తల్లి చంద్రశేఖర్ రెడ్డితో ఉన్న పాత ఫొటోలను షేర్ చేశారు. కుమారుడిగా మీడియా ముఖంగా ఒప్పుకోవాలని, లేదంటే డీఎన్ఏ పరీక్షకు సిద్దం కావాలని సవాల్ చేశారు. తాను చూపించిన ఆధారాలపై మేకపాటి ఇంతవరకు స్పందించలేదని ఆరోపిస్తున్నాడు శివచరణ్. ఆస్తులు, రాజకీయ వారసత్వం అవసరం లేదని, కుమారుడిగా అంగీకరిస్తే చాలంటున్నాడాయన. శివచరణ్ రెడ్డి వల్ల చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పినా ఇబ్బందే, చాటేసిన ఇబ్బందికర పరిస్థితి. ఇక డీఎన్ఏ టెస్ట్ అంటే.. అసలు నిజం బయట పడే అవకాశం ఉంది.
జీవితంలో ముఖ్యమైన సంఘటనల్లో మిస్ అయ్యాను, జన్మనివ్వమని మిమ్మల్ని అడగలేదు. 14 ఏళ్ల వయసులో మీరు మమ్మల్ని విడిచిపెట్టారు. చదువు కోసం ఫీజు కట్టినందుకు ధన్యవాదాలు. తండ్రి బాధ్యత అక్కడితో ముగియదు. తల్లితో 18 ఏళ్లు కలిసి జీవించి వదిలిపెట్టారు. మమ్మల్ని ఎప్పుడూ రహస్యంగానే ఉంచారు. ఇప్పుడైనా మీ కుమారుడిగా గుర్తించండి, ఇది మీరు మాత్రమే చేయగలిగిన పని. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చానంటే ఓ ఇంటర్వ్యూలో మీకు అబ్బాయిలు లేరన్నారు. మరి నేనేవరిని..? మీ కొడుకుని కానా, నా పరిస్థితిని అర్థం చేసుకోండి’ అని లేఖలో రాశాడు శివచరణ్. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలోనే వీరి కుటుంబానికి మంచి రాజకీయ పలుకుబడి ఉంది. ఇప్పుడు శివ చరణ్ రెడ్డి విడుదల చేసిన లేఖ, ఫొటోలు చంద్రశేఖర్ రెడ్డి ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి.