విశాఖపట్టణం లోక్ సభ నుంచి పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పష్టంచేశారు. ఇక్కడి ప్రజల మద్దతు తనకు ఉందన్నారు. పవన్ కల్యాణ్ కన్నా తానే బెటర్ అని ఎంపీ అన్నారని గుర్తుచేశారు.
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరసగా పర్యటనలు చేస్తున్నారు. విశాఖపట్టణం పర్యటనలో ఉండగా.. బీసీ నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఆసక్తికర అంశాలను మాట్లాడారు.
విశాఖపట్టణం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని కేఏ పాల్ (KA Paul) ప్రకటించారు. ఇక్కడ తనకు ప్రజలందరి మద్దతు ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్నా తానే బెటర్ అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజలతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపారు. నవంబర్ 9వ తేదీన గ్లోబల్ క్రిస్మస్ కార్యక్రమం నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి 200 దేశాలకు సందేశం ఇస్తానని చెప్పారు.
తెలంగాణలో కూడా తమ పార్టీకి మంచి ఊపు ఉందన్నారు. అలాగే కేసీఆర్ పాలనలో ఆ రాష్ట్రం అదోగతి పాలైందని విమర్శించారు. కేసీఆర్ పాలన కన్నా.. కేఏ పాల్ పాలన కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో శాంతి చేకూరాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలని టైమింగ్ పంచ్ వేశారు. గత కొద్దిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేఏ పాల్ యాక్టివ్గా ఉంటున్నారు. ఏ ఎన్నిక అయినా సరే పోటీ చేస్తున్నారు. అధికార పక్షం, విపక్షం అనే తేడా లేకుండా అందరినీ ఏకీపారేస్తున్నారు.