»Jagan Governments Key Decision Good News For Those Who Have Ration Cards
Andhrapradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం..రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్
ఏపీలో రేషన్‌కార్డు ఉన్నవారికి ఈ నెల ఆఫ్‌లైన్‌లోనే సరుకులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వర్ సమస్యలు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
రేషన్ కార్డులు (Ration Cards) ఉండేవారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీలో గత కొన్ని రోజుల నుంచి రేషన్ ఇచ్చే విషయంలో సర్వర్ సమస్యలు (Server Issue) తలెత్తాయి. ఈ నేపథ్యంలో సర్వర్ సమస్యకు ప్రత్యామ్నాయంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వర్ సమస్య పరిష్కారం అయ్యే వరకూ రేషన్ కార్డులు ఉండేవారికి బియ్యం, గోధుమపిండి, పంచదార వంటి సరుకులను ఆఫ్‌లైన్ (Offline)లోనే సరఫరా చేయాలని పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలిచ్చింది.
అక్టోబర్ 5వ తేది నుంచి సర్వర్ పనిచేయడం లేదు. కార్డుదారులు గంటల కొద్దీ మొబైల్ వాహనాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు దారుల నుంచి నిరసనలు వ్యక్తమవ్వడంతో ఎండీయూ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థతి చక్కదిద్దితేనే సరుకులు పంపిణీ చేయస్తామని, సర్వస్ పనిచేసేంత వరకూ వేలిముద్రలు అవసరం లేకుండా ఆఫ్‌లైన్ లోనే కార్డు నంబర్ నమోదు చేసుకుని సరుకులు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు.
దీంతో ఆఫ్‌లైన్ ద్వారానే రేషన్ ఇవ్వనున్నారు. అయితే పోర్టబిలిటీ కార్డులకు మాత్రం సరుకులు ఇవ్వరని, ఇతర ప్రాంతాల్లో కార్డులు కలిగిన వారికి కూడా రేషన్ ఇవ్వలేమని అధికారులు తెలిపారు. సర్వర్ యంత్రాలు మొరాయించడంతో ఈ సమస్య నెలకొంది. వేలిముద్రలు వేయాల్సిన సమయంలో యంత్రాలు మొరాయించడంతో ఒక్కో కార్డుకు కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దీని వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 15వ తేది వరకే రేషన్ పంపిణీ చేస్తుంటారు. ఆ గడువుకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రేషన్ కార్డు దారులు (Rationcard Holders) ఆందోళన చెందుతున్నారు.