తిరుమలలో అలిపిరి (Alipiri) నడక మార్గంలో చిరుత దాడిలో ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా టీటీడీ (TTD) ప్రకటించింది. ఈ హై అలర్ట్ (High alert) జోన్ లో ప్రతి 100 మంది భక్తులను ఓ బృందంగా పంపిస్తారు. భక్తులకు ముందు భాగంలోనూ, వెనుక భాగంలో రోప్ లతో రక్షణ కల్పిస్తారు. ఈ బృందానికి పైలెట్ గా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది.మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Evo Dharma Reddy) మాట్లాడుతూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు.
అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. టీటీడీ (TTD) నుంచి రూ.5లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.ఇక, బాలికపై చిరుత దాడి ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. నడకదారి భక్తులకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. చిరుత కోసం అటవీశాఖ అధికారులు (Forest officials) నడకదారిలో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ అధికారులు గుర్తిస్తున్నారు.