Government Can Allocate Land To Poor People At R-5 Zone
R-5 Zone:అమరావతి ఆర్-5 జోన్లో (R-5 Zone) పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) కీలక తీర్పునిచ్చింది. ఆర్-5 జోన్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వొచ్చని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అరుణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. హైకోర్టు (high court) తుది తీర్పునకులోబడి ప్రభుత్వ నిర్ణయం ఉండాలని సూచించింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.
ఆర్-5 జోన్లో పట్టాలు ఇస్తే కనుక అది తుది తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టులో పెండింగులో ఉన్న రిట్ పిటిషన్ తీర్పుకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని తేల్చిచెప్పింది. పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండబోదని వెల్లడించింది.
ఆర్-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రైతులు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఆర్-5 జోన్లలో ఇప్పటికే ప్లాట్ల కేటాయింపులు జరిగాయని ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫు న్యాయవాదులు పేర్కొనడంతో ప్లాట్ల కేటాయింపులపై అభ్యంతరం చెప్పబోమని తెలిపింది. మూడు రాజధానులపై హైకోర్టు రిట్ పిటిషన్ తీర్పుకు లోబడే పట్టాలు ఉంటాయని స్పష్టం చేసింది.