AP Govt: పేదలకు పంపిణీ చేసిన ఎసైన్డ్ భూముల్ని ప్రజా ప్రయోజనాల కోసం కానీ భూ సేకరణ నిమిత్తం కానీ వెనక్కు తీసుకునే పక్షంలో మార్కెట్ విలువ ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎసైన్మెంట్ చట్టం -1977లో పలు సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ నిన్న నోటిఫికేషన్ జారీ చేశారు. ఎసైన్డ్ భూములు కలిగిన వారికి ఇతర భూముల యజమానులతో సమానంగానే మార్కెట్ విలువల్ని అనుసరించి చెల్లింపులు జరుగుతాయని.. ఈ విషయంలో సంప్రదింపులకు అవకాశం లేదని తెలిపారు.
భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూముల్ని సేకరించినప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ కంటే యాజమానులు ఎక్కువ డిమాండ్ చేసిన సందర్భాల్లో జిల్లా కలెక్టర్ సంప్రదింపులు జరుపుతారు. ఇరువర్గాల వారికి ఆమోదయోగ్యమైన ధరు ప్రకటిస్తారు. అయితే ఎసైన్డ్ భూముల విషయంలో ఇలాంటి అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.