»Ashwini Vaishnav Ap Government Has Not Given Land For Railway Zone
Ashwini Vaishnav: రైల్వే జోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు
లోక్‌సభలో టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయం గురించి కేంద్రమంత్రిని అడిగారు. దీంతో అతను దక్షిణ కోస్తా రైల్వేజోన్ విషయంలో ఏపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Ashwini Vaishnav: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ విషయంలో ఏపీ సర్కార్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను అధికారికంగా ప్రారంభించే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? జోనల్‌ప్రధాన కార్యాలయ నిర్మాణం ఎప్పటినుంచి ప్రారంభమైంది? ఎప్పటికి పూర్తవుతుంది? ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఉపయోగించారు? నిర్మాణం పూర్తిచేయడానికి ఎన్నిరోజులు పొడిగించారు? అని లోక్‌సభలో టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. దీనికి అతను దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని బదులిచ్చారు.
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారైంది. రూ.106.89 కోట్ల అంచనాతో జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మంజూరు చేశాం. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.10 కోట్లు కూడా కేటాయించాం. భూసర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్ ప్లాన్ తయారీ బాధ్యతలను కూడా తూర్పుకోస్తా రైల్వేజోన్‌కు అప్పగించాం. ముడసర్లోవలోని 52.2 ఎకరాల భూమిలో ఈ జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించాం. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందున దానికి బదులుగా ముడసర్లోవలో 52.2 ఎకరాల భూమిని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సి ఉందని అన్నారు. దీనికి అనువైన భూమిని ప్రభుత్వం గుర్తించి రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉందని అన్నారు.