తిరుమలలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మిస్సైన వారు 7వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అదృశ్యమైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల (Tirumala)లో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. తిరుమలలోని స్థానిక ఆర్బీసీ సెంటర్‌కు చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుమల టూటౌన్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. తిరుమలకు చెందిన ఎస్.కృష్ణ తనయుడు చంద్రశేఖర్, యోగేశ్ కుమారుడు వైభవ్ యోగేశ్, శ్రీవరదన్ మిస్ అయినట్లుగా వెల్లడించారు.
మిస్సింగ్ అయిన ఆ ముగ్గురు పిల్లల వయసు 13 సంవత్సరాలని తెలిపారు. ఈ ముగ్గురు విద్యార్థులు కూడా తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం వారంతా పుస్తకాలు తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్లాలని పాఠశాలలో తెలిపారు.
అయితే ఇంటికొచ్చిన ఆ ముగ్గురు పిల్లలు ల్యాప్‌టాప్ తీసుకుని బస్సెక్కి తిరుపతి ఏడు కొండల బస్టాండ్‌కు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి ఆ పిల్లల ఆచూకీ కనిపించలేదని, విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల టీచర్లను ఆరా తీయగా వారు కూడా తెలియదని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ అయిన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.