మహిళలకు ఏపీ సర్కార్ రూ.లక్షన్నర వరకూ సాయం అందించనుంది. మహిళా శక్తి స్కీమ్ ద్వారా ఈ రుణాన్ని అందించి వారి ఆర్థిక ఆదాయ పెరుగుదలకు ఆటోలను ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా 660 మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సాధికారిత లక్ష్యంగా పేదింటి మహిళలకు చేయూతనివ్వనుంది. ఇందులో భాగంగా ‘మహిళా శక్తి’ (Mahila Shakti) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో ఆటోలు (Auto’s) సమకూర్చుకుని వాటి ద్వారా ఆర్థికంగా బలపడేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ స్కీమ్ ద్వారా వడ్డీ లేని రుణాలను ఏపీ సర్కార్ ఇవ్వనుంది.
ఈ ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా మహిళలు ఆటోలను అద్దె ప్రాతిపదికన తీసుకుని నడుపుకొంటూ ఉన్నారు. ఇకపై వారు అద్దెవి కాకుండా సొంత ఆటోలను నడుపుకుని ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు సీఎం జగన్ (Cm Jagan) ఆధ్వర్యంలో అధికారులు ‘మహిళా శక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌లో ఆటోకు అయ్యే ఖర్చులో 10 శాతం లబ్దిదారు అయిన మహిళ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన 90 శాతం ప్రభుత్వమే రుణం రూపంలో అందించనుంది.
ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందేవారికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజు డిసెంబర్ 6వ తేదిన కొత్త ఆటోలను అందించనున్నారు. మిగిలిన అన్ని మండలాల్లో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న కొత్త ఆటోలను అందించనున్నారు. ఈ స్కీమ్‌లో మహిళలు తాము తీసుకునే మొత్తం రుణం 48 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. మండలానికి ఒకరు చొప్పున మొత్తం 660 మందికి ఈ స్కీమ్ ద్వారా ఆటోలను అందించనున్నారు. ఇప్పటికే 229 మందిని ఎంపిక చేశారు.
ఆటోలను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు (Banks), ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలు కూడా రుణాలను ఇవ్వనున్నాయి. ఈ రుణం ద్వారా రూ.లక్షన్నర వరకూ లబ్ధిదారులకు అందుతుంది. దీంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఈ మహిళా శక్తి స్కీమ్ (Mahila Shakti Scheme) ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.