తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణం అవుతుండగా కారు అదుపు తప్పింది. ఆ క్రమంలో కారు కొండను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భక్తులు తమిళనాడు ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. స్వామి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇది వరకు తిరుమలలో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ ఎలక్ట్రిక్ బస్సు కూడా బోల్తా పడిన ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ఈ ప్రమాదాలపై తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తం అయ్యింది. అవసరమైన అన్నిచోట్లా ముందస్తు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే ప్రమాదాలు జరగకుండా మహా శాంతి హోమాన్ని నిర్వహించింది.
ఇకపోతే దీపావళి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పండగ రోజు మొత్తం 74,807 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే విధంగా 21,974 మంది తమ తలనీలాలను సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని తెలిపారు.