దేశంలో రోడ్డు ప్రమాద ఘటనలు రోజూ కలకలం సృష్టిస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీ కొనడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరఠ్‌లో బ్రజ్‌ఘాట్ టోల్ ప్లాజా దగ్గర ఈ రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్రజ్‌ఘాట్ టోల్ ప్లాజాకు సమీపంలోకి రాగానే కారు(CAR) అదుపు తప్పి వేగంగా ఎదురుగా ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ ఘటనలో గాయ పడిన ఒక వ్యక్తిని మీరఠ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ విషయమై స్థానిక పోలీస్ సూపరెండెంట్ అభిషేక్ వర్మ మాట్లాడారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగిందని తెలిపారు. డ్రైవర్ తప్పిదం వల్లనే కారు అదుపు తప్పి ఇంతటి పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.