ఓ చిన్న విషయం చిలికి చిలికి గాలి వానగా మారడం అంటే ఇదే. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో…చిరంజీవి, గరికపాటి మధ్య జరిగిన సంఘటన పెద్ద దుమారమే రేపింది. తన ప్రవచనాలకు ఆటంకం కలగడంతో గరికపాటి అసహనం వ్యక్తం చేయడం… దానిని చిరంజీవి అర్థంచేసుకొని వెంటనే ఆ సెల్ఫీ సెషన్ ఆపేయడం నమకు తెలిసిందే.అయితే.. నాగబాబు ఈ విషయంలో వేలు పెట్టడం, అభిమానులు రెచ్చిపోవడంతో విషయం చాలా పెద్దదిగా మారింది. దీంతో గరికపాటి కాస్త తగ్గి.. చివరకు క్షమాపణలు చెప్పడం గమనార్హం.
ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి తన ప్రసంగం ప్రారంభిస్తున్న సమయంలో కార్యక్రమానికి విచ్చేసిన చాలామంది చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తూ ఆయన ఏం చెబుతున్నారో కూడా వినిపించుకునే పరిస్థితిలో లేకపోవడంతో ఆయన కాస్త మెగాస్టార్ చిరంజీవి పై అసహనం వ్యక్తం చేసారు.
మీరు ఫోటో సెషన్ ఆపకపోతే తాను ప్రసంగించడం ఆపేస్తానని మైకు వదిలేసి వెళ్లిపోవడానికి తనకు ఎలాంటి మొహమాటం లేదని అన్నారు గరికపాటి. ఈ మాటలు మొదట చిరంజీవి వినిపించుకోలేదు కానీ విషయం అర్థమైన వెంటనే ఫొటో సెషన్ ఆపేసి గరికపాటి పక్కకి వచ్చి మెగాస్టార్ కూర్చున్నారు. తర్వాత మెగాస్టార్ గరికపాటికి తాను అభిమానినని మీ అందరికీ నేను అభిమాన హీరో అయితే నాకు ఆయన అభిమాన ప్రసంగకర్త అంటూ ఆయన ఒక రకంగా పొగడ్తల వర్షం కురిపించారు. చిరంజీవి మీద గరికపాటి నరసింహారావు ఫైర్ అవడం మీద అటు మెగా అభిమానులు కానీ సినీ రంగంలో పలు వర్గాల వారు గాని ఘాటుగా స్పందిస్తున్నారు. చిరంజీవి గారి లాంటి ఉన్నత వ్యక్తిత్వం గురించి ఆయన ఎలా మాట్లాడారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద ఎట్టకేలకు గరికపాటి నరసింహారావు స్పందించారు.
ఆ రోజు జరిగింది దానికి నేను ఆయనకు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. నా క్షమాపణలు చిరంజీవి గారు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నానని, గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. ఇక నాగబాబు ఆరోజు గరికపాటిగారు ఏదోమూడ్లో అనేసుంటారు ఎవరు దీనిపై రాద్ధాంతం చేయొద్దు అని నాగబాబు తెలిపారు.