»Galla Jayadev Action Should Be Taken Against Stolen Votes
Galla Jayadev: దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.
Galla Jayadev: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆంధ్రపదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల గురించి పార్లమెంట్లో గుట్టు రట్టు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఏపీలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఈసీ ప్రధాన విధి. కానీ, రాష్ట్రంలో ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను డీఆర్వోలు, స్థానికి సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఒత్తిళ్లకు లొంగి జాబితాలో మార్పులు చేస్తున్నారని అన్నారు.
ఇదే విషయంపైన టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఓటర్ల జాబితా నుంచి టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారనే ఫిర్యాదులో ఆధారాలతో వివరించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. ఏపీలో ఎన్నికల అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అధికారుల పర్యవేక్షణలో వెంటనే ఓటర్ల జాబితా రూపొందించడంపై దృష్టి సారించాలని అన్నారు. ఓటర్ల జాబితో లోపాలు ఉన్నాయంటే.. కింద స్థాయి అధికారులపైకి ఉన్నతాధికారులు తోసేస్తున్నారని అన్నారు. సుమారుగా 10 లక్షల ఫిర్యాదులు చేసినా అక్రమ ఓటర్లను పట్టించుకోలేదని జయదేవ్ అన్నారు.
తుది ముసాయిదా జాబితా విడుదల చేసిన సందర్భంలో 13 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. దొంగ ఓట్లు ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా కేంద్రం వారిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారని అన్నారు. దొంగ ఓట్లపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని అన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించే విధంగా చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.