గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 143 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షకు గురయ్యారు. ఈక్రమంలో విపక్ష ఎంపీలు ఖర్గే నేతృత్వంలో భారీ నిరసన చేపట్టారు.
Parliament: పార్లమెంట్లో విపక్ష ఎంపీలపై గత కొన్ని రోజుల నుంచి సస్పెన్షన్ వేటు జరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 143 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇలా సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎంపీలు ఈరోజు ఆందోళనకు దిగారు. పాత పార్లమెంట్ భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకు ధర్నా చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ ప్లకార్డులను చేతపట్టి భారీ నిరసన చేపట్టారు. ఈ ర్యాలీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుండి నడిపించారు. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఖర్గే విమర్శించారు. భద్రతా వైఫ్యలంపై చర్చించడానికి అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ ఛైర్మన్‌ను కోరుతున్నామన్నారు.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా దీనిపై పార్లమెంట్లో ప్రకటన చేయాలి. ప్రధాని బయట మీడియాతో మాట్లాడాలని ఖర్గే అన్నారు. అసలు భద్రతా వైఫల్యం ఘటన ఎందుకు జరిగింది? ఎవరు బాధ్యులు? అని ఖర్గే ప్రశ్నించారు. ఇండియా కూటమికి చెందిన సభ్యులు కూడా రేపు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నారని అన్నారు. పార్లమెంట్లో జరిగిన ఘటనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి నుంచి వరుసగా ఉభయ సభల ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడగా.. తాజాగా ఆ సంఖ్య 143కి చేరింది.