»Coordinating Committee Meeting Begins Discussion Will Continue On 6 Topics
TDP-Janasena: సమన్వయ కమిటీ భేటీ ప్రారంభం..6 అంశాలపై సాగనున్న చర్చ!
టీడీపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో మొదటగా చంద్రబాబు అరెస్ట్‌ను ఇరు పార్టీల నేతల ఖండించారు. ప్రధానంగా ఆరు అంశాలపై సమావేశంలో చర్చలు సాగనున్నాయి.
టీడీపీ, జనసేన (TDP-Janasena) నాయకుల సమన్వయ కమిటీ మొదటి సమావేశం ప్రారంభమైంది. రాజమండ్రిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో టీడీపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశం సాగుతోంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులు మాత్రమే ఉంటారు. ప్రధానంగా 6 అంశాలపైనే చర్చ సాగనున్నట్లు టీడీపీ, జనసేన వర్గాల సమాచారం.
సమన్వయ కమిటీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్లతో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సమావేశం నిర్వహించారు. పవన్‌తో చర్చించాల్సిన అంశాలపై లోకేశ్ పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరిపారు. జనసేనానితో జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ చేపడుతున్న విధానాలపై చేపట్టే పోరాట కార్యక్రమాల గురించి చర్చించనున్నారు.
అలాగే టీడీపీ, జనసేన కలిసి రానున్న రోజుల్లో ఏ రకమైన ఆందోళన కార్యక్రమాలు చేయనున్నాయనే విషయాలపై కూడా సమావేశంలో చర్చ సాగనుంది. అదేవిధంగా ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, జాబితాలో అవకతవకలపై బూత్, జిల్లా స్థాయి జేఏసీ కమిటీల ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని టీడీపీ, జనసేన తీసుకుంది. ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత మొదటగా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానించింది. అలాగే చంద్రబాబు అరెస్టు అక్రమమని టీడీపీ, జనసేన నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.