టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) ఓ ఇంటి వారయ్యారు. వంగవీటి రంగా తనయుడు రాధా, పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు ప్రముఖులు తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా నేతలంతా హాజరై వధూవధులను ఆశీర్వదించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan), ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధా, పుష్పవల్లి(Pushpavalli)కి శుభాకాంక్షలు తెలియజేశారు. వంగవీటి రాధాకు పార్టీలకు అతీతంగా మిత్రులు ఉండడంతో ఆయన పెళ్లిలో పలు పార్టీల నేతలు దర్శనమిచ్చారు.
పవన్ కాసేపు రాధాతో కాసేపు మాట్లాడి.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది. పుష్పవల్లి స్వస్థలం నర్సాపురం(Narsapuram). ఏలూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లి. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని(Kodali Nani), కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జలీల్‌ఖాన్(Jalil Khan), నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.