ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ని హైకోర్టు సస్పెండ్ చేయగా.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీం కోర్టు దీనిపై స్పందించింది. ఈ జీవో విషయంలో తాము జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పింది. సుప్రీం నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పు తెలుసుకుని జీవో నెం.1ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు
రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్ షోలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెం.1 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 23 వరకు ఈ జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అదే రోజున తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. అయితే ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తలుపుతట్టింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్పై విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ జీవో విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ చేపడుతుందని తీర్పునిచ్చింది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్ బెంచ్ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేసు మళ్లీ ఏపీ హైకోర్టు వద్దకే వచ్చింది.