Judge ముందు ఏడ్చేసిన చంద్రబాబు.. అక్రమంగా అరెస్ట్ చేశారని ఆవేదన
స్కిల్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. వర్చువల్‌గా జడ్జీ ముందు బాబును సీఐడీ అధికారులు ప్రవేశపెట్టగా.. ఆయన ఏడ్చేశారు.
Chandrababu Cry : స్కిల్ స్కామ్ నుంచి మాజీ సీఎం చంద్రబాబు ఇప్పట్లో బయట పడేలా లేరు. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఏసీబీ కోర్టు, హైకోర్టులో ఊరట లభించడం లేదు. క్వాష్ పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు కొట్టివేయగా, సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంద్రబాబు బాధ అంతా ఇంతా కాదు. అవును.. లోపల నుంచి వస్తోన్న దు:ఖాన్ని ఆపుకోలేక జడ్జీ ముందు ఏడ్చేశారు.
సీఐడీ కస్టడీ
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో జరిగిన అవకతవకల గురించి మరింత లోతుగా విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిల్‌పై ఇరుపక్షాల సుధీర్ఘ వాదనలు జరిగాయి. 5 రోజుల కస్టడీని సీఐడీ అధికారులు అడగగా.. రెండు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అంగీకరించింది. జైలులోనే విచారించాలని స్పష్టంచేసింది. కస్టడీకి సంబంధించిన పిటిషన్ విచారణ జరుగుతున్న క్రమంలో వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ కోర్టు జడ్జీ ముందు ప్రవేశపెట్టారు.
జడ్జీ ముందు ఏడ్చిన బాబు
జడ్జీ ముందు తన గోడును వెళ్లగక్కారు చంద్రబాబు. తనను అకారణంగా జైలులో పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని.. ఏడ్చేశారు. చంద్రబాబు ఏడుస్తోన్న సమయంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఉంది. బాబు చెప్పిన అంశాలు నోట్ చేసుకున్నానని జడ్జీ బదులు ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. మీపై ఆరోపణలు మాత్రమే వచ్చాయని వివరించారు. దర్యాప్తులో నిజ నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఓ కేసులో రిమాండ్‌లో ఉండటాన్ని శిక్షగా భావించొద్దని నచ్చ జెప్పారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అని చంద్రబాబుకు జడ్జీ వివరించారు. అంతే తప్ప మరోటి కాదని, అందరికీ ఒక్కటే న్యాయం ఉంటుందని వివరించారు.
అవినీతి
స్కిల్ స్కామ్ చంద్రబాబు మెడకు చుట్టుకుంది. రూ.182 కోట్ల వరకు అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు అంటున్నారు. ఆ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు 2 రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వడంతో.. కేసులో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బాబును బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్కామ్‌లో క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు చంద్రబాబు న్యాయవాద బృందం సిద్దంగా ఉంది. సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేస్తారని తెలుస్తోంది.
జగన్- చంద్రబాబు
అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు జైలులో ఉన్నారు. కేసు కొట్టివేసేందుకు ఫేమస్ లాయర్లను టీడీపీ నియమించుకుంది. సిద్ధార్థ లూథ్రాకు రోజుకు కోటిన్నర నగదు ఇస్తోంది. అయినప్పటికీ చంద్రబాబుకు ఊరట లభించడం లేదు.