Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. 5 రోజుల కస్టడీ కావాలని సీఐడీ అధికారులు అడగగా.. 2 రోజుల కస్టడీకి అంగీకరించింది. రాజమండ్రి జైలులోనే చంద్రబాబును విచారించాలని స్పష్టం చేసింది. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సిద్దార్థ లుథ్రా, సిద్దార్థ్ అగర్వాల్ వాదించారు.
మరోవైపు హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి క్వాష్ పిటిషన్ వేయగా.. ధర్మాసనం తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను చంద్రబాబు తరఫు న్యాయవాదులు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై 19వ తేదీన వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, సిద్దార్థ లూథ్రా వాదించగా.. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఇదే పిటిషన్‌పై నిన్న తీర్పు వెలువరించాలి. అది ఈ రోజు ఉదయం 10.30కు వాయిదా పడింది. తర్వాత మధ్యాహ్నాంకు వాయిదా పడింది. ఏకవాక్యంతో హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీనిని చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.