»Ap Iiit Graduate The Website Was Hacked And Rs He Stole 4 Crores Ap Student Arrested
AP IIIT Graduate: వెబ్సైట్ హ్యాక్ చేసి రూ. 4 కోట్లు దొబ్బేశాడు..ఏపీ స్టూడెంట్ అరెస్ట్
ఐఐఐటీ చదివిన ఓ విద్యార్థి హ్యాకింగ్ నేర్చుకున్నాడు. తన హ్యాకింగ్ నైపుణ్యంతో ఓ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి రూ.4.16 కోట్ల విలువైన రివార్డు పాయింట్లను దోచేశాడు.
ఒంగోలులోని ఐఐఐటీ విద్యార్థి (IIIT Student) ఓ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. ఆ సైట్ ద్వారా రూ.4.16 కోట్ల విలువైన రివార్డు పాయింట్ల (Reward Points)ను దోచేశాడు. చాలా రోజుల నుంచి ఈ కేసును పరిశీలిస్తున్న బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు బొమ్మలూరు లక్ష్మీపతిగా పోలీసులు గుర్తించారు. అతని నుంచి 4 కిలోల బంగారం, రూ.16.5 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానంద తెలిపిన వివరాల మేరకు.. ఈ ఏడాది సైబర్ క్రైమ్ (Cyber Crime) కేసులో బెంగళూరు పోలీసులు ఛేదించిన అతిపెద్ద కేసు ఇదేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మీపతి ఒంగోలులోని ఐఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడన్నారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసి ఆ తర్వాత కొన్ని నెలల పాటు దుబాయ్ వెళ్లాడని, తిరిగి మళ్లీ బెంగళూరుకే వచ్చి సెటిల్ అయ్యాడన్నారు.
కాలేజీ రోజుల్లోనే లక్ష్మీపతి (Lakshmipathi) హ్యాకింగ్ నేర్చుకున్నాడని, తన నైపుణ్యాలతో రివార్డ్ 360 అనే సంస్థపై సైబర్ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఆరు నెలల పాటు గిఫ్ట్ వోచర్లను తన ఖాతాలకు మళ్లించాడన్నారు. తన హ్యాకింగ్ స్కిల్స్ (Hacking) ఉపయోగించి లక్ష్మీపతి సెక్యూరిటీని సైతం ఛేదించాడని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో తన గిఫ్ట్ ఓచర్లతో బంగారం, వెండి, బైకు మొదలైన వాటిని కొనుగోలు చేశాడన్నారు. ఈ సంస్థ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.