తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతు బజార్లలో సబ్సిడీపై రైతులకు ఉల్లిని అందించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. అటు కేంద్రం కూడా ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఇతర ప్రాంతాల్లోని ఉల్లిని పలు ప్రాంతాలకు తరలించి విక్రయించాలని నిర్ణయించుకుంది.
ఉల్లి ధరలు (Onion Prices) మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉల్లి ధరలను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే రైతులకు కాస్త ఊరట లభిస్తున్నా దిగుబడి విషయంలో పెద్ద దెబ్బ తగిలింది. వర్షాభావం కారణంగా రాష్ట్రంలో దిగుబడి చాలా వరకూ తగ్గిపోయింది. ఉల్లి దిగుబడి తగ్గడంతోనే ధరలు అమాంతం పెరిగాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉల్లిని కర్నూలు జిల్లా రైతులు పండిస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని రూరల్, కోడుమూరు, గూడూరు, బెలగల్, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, డోన్ తదితర ప్రాంతాలలో ఉల్లిని ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఈసారి వర్షాలు లేకపోవడం వల్ల దిగబడి బాగా తగ్గింది. అయినా కూడా రోజుకు 5000 క్వింటాళ్లకు పైగా ఉల్లి మార్కెట్‌కు వస్తోంది. ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.5 వేలు పలుకుతోంది. గతంలో ఈ ధరలు ఎప్పుడూ లేవని, ఉల్లి అత్యధికంగా మార్కెట్‌కు వస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇతర జిల్లాల్లోని రైతు బజార్ల (Raitu Bajar)లో సబ్సిడీపై విక్రయించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే కర్నూలు మార్కెట్లోని (Kurnool Market) ఉల్లిని అధికారులు కొనుగోలు చేసి ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు లాంటి జిల్లాలకు ఎగుమతి (Onion Export) చేయడం ప్రారంభించారు. ఇకపోతే సప్లై (Supply) తగ్గడం వల్ల ఉల్లి ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురువడంతో అక్కడ దిగుబడి పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర ప్రాంతాలలోని, ఇతర దేశాలలోని ఉల్లిని దిగుమతి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం లాగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఉల్లిని ఇతర ప్రాంతాలకు తరలిస్తే ధరలు అదుపులో ఉంటాయని భావించింది. సాధ్యమైనంత త్వరలో ధరలు కంట్రోల్లోకి వస్తాయని అధికారులు, నిపుణులు భావిస్తున్నారు.