Surya Narayana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం కలిగించారనే అభియోగాలతో ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణను (Surya Narayana) పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ గురించి సమాచారం తెలియడంతో కొద్దీరోజుల క్రితం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన ఇల్లు, ఆఫీసు, తెలిసిన వారి ఇంటి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి.. నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సూర్య నారాయణపై మే 31వ తేదీన విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ కేసులో సూర్య నారాయణ ఏ5గా ఉన్నారు.
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం ఏడీజే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 15వ తేదీన బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. విజయవాడ, విశాఖపట్టణం, ఢిల్లీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న అదుపులోకి తీసుకుని.. విజయవాడలో ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారని తెలిసింది. సూర్య నారాయణ అరెస్ట్ గురించి పోలీసులు అధికార ప్రకటన చేయలేదు.