»Alert To The People Of Ap Aadhaar Special Camps From Tomorrow
Aadhaar Special Camps: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపటి నుంచి ఆధార్ స్పెషల్ క్యాంపులు
ఆధార్ కార్డులో తప్పులు ఉండటం వల్ల చాలా మంది ప్రభుత్వ పథకాలను కోల్పోతుంటారు. అటువంటి వారి కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే. స్కూల్ అడ్మిషన్ల నుంచి పింఛన్ పొందడం వరకూ కూడా ఆధార్ లేనిదే ఆ పనీ జరగదు. అయితే కొంతమందికి ఆధార్లో కొన్ని తప్పులు దొర్తి ఉంటాయి. వాటి వల్ల లబ్ధిపొందాల్సిన వారు ప్రభుత్వ పథకాలకు (Government schemes) అనర్హులుగా నమోదవుతుంటారు. ఆధార్ కార్డులో దొర్లిన తప్పుల కారణంగా అర్హులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీ (Andhrapradesh) సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్ ఆధార్ క్యాంపులను (Special Aadhaar Camps) ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 22వ తేది నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. అంటే రేపటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు జరగనున్నాయి. ఆగస్టు 22, 23, 24, 25వ తేదీల్లో మొత్తం నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు ఉంటాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ (Lakshmisha) అధికారులకు ఆదేశాలు అందించారు.
ఆధార్ (Aadhaar) తీసుకున్న తర్వాత పదేళ్లకాలంలో కనీసం ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ (UIDAI) ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గత పదేళ్లలో ఆధార్ అప్డేట్ చేసుకోని వారు కచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో తమ సమీప సచివాలయానికి వెళ్లి క్యాంపులో అప్డేట్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.56 కోట్ల మందికి ఆధార్ కార్డులుండగా వారిలో సుమారుగా 1.49 కోట్ల మంది గత పదేళ్లలో తమ వివరాలను అప్డేట్ చేసుకోలేదని ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకునే వారు కూడా ఈ క్యాంపులో కొత్త కార్డు పొందొచ్చని ప్రభుత్వం తెలిపింది.