సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలో వాణీ జయరాం మృతిచెందినట్లు ఆమె బంధువులు వెల్లడించారు. ఇప్పటి వరకూ వాణీ జయరాం 20 వేల పాటలకు పైగా పాడారు.
క్లాసైనా, క్లాసికలైనా, జానపదమైనా, బీట్ సాంగ్ అయినా వాణీ జయరాం గళంలో పడితే ఏ పాటైనా సరే అపురూపమైన ఆణిముత్యంలా జాలువారుతుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వాణీ జయరాం సినీ సంగీత ప్రియుల్ని తన గాత్రంతో అలరించింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందజేసింది. ప్రస్తుతం ఆమె మరణవార్తతో సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వాణీ జయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురీతో కలిసి మొత్తం 14 భాషల్లో పాటలు పాడారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి.