ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలు ఉన్నట్లు పని మనిషి చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణీ జయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
పని మనిషి ఇంటికొచ్చాక ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపులు తీయలేదు. దీంతో పనిమనిషి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు తెలిపింది. వాణీ జయరాం నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె స్పృహలో లేకపోవడంతో పనిమనిషి, స్థానికులు కలిసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. వాణీ జయరాం మరణంపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.