ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి భారతీయ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. 14 భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో ఆమె 20 వేలకు పైగా పాటలు పాడారని, ఆమె సినీ రంగానికి ఎంతో సేవ చేశారని ఈసందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వాణీ జయరామ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
క్లాసైనా, క్లాసికలైనా, జానపదమైనా, బీట్ సాంగ్ అయినా వాణీ జయరాం గళంలో పడితే ఏ పాటైనా సరే అపురూపమైన ఆణిముత్యంలా జాలువారుతుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వాణీ జయరాం సినీ సంగీత ప్రియుల్ని తన గాత్రంతో అలరించింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందజేసింది. ప్రస్తుతం ఆమె మరణవార్తతో సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వాణీ జయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురీతో కలిసి మొత్తం 14 భాషల్లో పాటలు పాడారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి.