Ap Politics: వైసీపీది ఉప్మా ప్రభుత్వం : పవన్ కళ్యాణ్
వైసీపీ ప్రభుత్వం ఆగడాలను అందరం కలిసికట్టుగా అణచివేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ సర్కార్ కులాల మధ్య చిచ్చు పెడుతోందని, వాటిని తాను సహించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ(YCP)ది ఉప్మా ప్రభుత్వం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. వంద మంది కష్టాన్ని కేవలం కొంత మందికి మాత్రమే పంచి, దానిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీది 70 :30 ప్రభుత్వం అని ఆరోపణలు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరంలో వారాహి విజయ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వైసీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని, వైసీపీ వద్ద ఉన్నట్లు తన దగ్గర వేల కోట్లు లేవని అన్నారు.
తన వద్ద సుపారీ గ్యాంగ్‌లు లేవని, వైసీపీ ప్రభుత్వాన్ని 70 శాతం మంది వరకూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు(MLAs) కోట్ల మందిని బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక ఎంపీని కొట్టించగలరని, ఎస్సీ వ్యక్తిని ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేయగలరని ఆరోపణలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టాలనే ఆలోచనతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యంగా లేకపోతే మళ్లీ వైసీపీ(YCP) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అందరం ఐక్యంగా ఉంటేనే అన్నీ సాధించగలమని అన్నారు. తాను ఓడిపోతానని నిర్ణయించుకున్న తర్వాతే క్రిమినల్స్ పై పోరాటానికి దిగానని, తనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తానన్నా తిరస్కరించినట్లు పవన్ గుర్తు చేశారు. తనకు వారాహే(Varahi Vehicle) రక్ష అని తెలిపారు.