The Kerala Story: సినిమా బ్లాక్ బస్టరే.. కానీ కొనడానికి భయపడుతున్నారు?
సినిమా వచ్చింది.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. కలెక్షన్లను ఓ రేంజ్లో కొల్లగొట్టింది. కానీ ఏం లాభం ఓటిటిలు ఆ సినిమాను చూస్తేనే భయపడుతున్నాయట. సాధరణంగా ఏదైనా సినిమా హిట్ అయితే ఓటిటి సంస్థలు ఎగబడతాయి. కానీ సెన్సేషనల్‌గా నిలిచిన 'ది కేరళ స్టోరీ' సినిమాను మాత్రం కొనే వారే లేరట. అసలు కేరళ స్టోరినీ డిజిటల్ సంస్థలు ఎందుకు కొనడం లేదు.
ఈ మధ్య కాలంలో కేరళ స్టోరీ సినిమా(The Kerala Story Movie)పై జరిగినంత వివాదం.. మరో సినిమాకు జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చూసిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లోను కేరళ స్టోరీని థియేర్లోకి తీసుకు రావద్దని నిరసనలు చేశాయి చాలా రాజకీయ పార్టీలు. కానీ ఎన్నో అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు మే 5న ‘ది కేరళ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు జరిగిన కాంట్రవర్శీ వల్ల భారీ పబ్లిసిటీ వచ్చింది. దాంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అదా శర్మ కీ రోల్ ప్లే చేసింది. కేరళలో 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలతోనే సినిమాను తెరకెక్కించారు.
అందుకే ఈ సినిమా(The Kerala Story Movie) కాంట్రవర్శీగా మారింది. కానీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఓపెనింగ్సే ఎనిమిది కోట్ల వరకు రాబట్టింది. మొత్తంగా 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 300 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఓటిటి సంస్థలు ఈ సినిమా కోసం పోటీపడడం ఖాయమనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకు రెండు కారణాలు వినిపిస్తున్నాయి. గతంలో హిందీలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ థియేటర్లో బ్లాక్ బస్టర్ అయింది కానీ.. ఓటిటిలో అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పుడు కూడా ది కేరళ స్టోరీ(The Kerala Story Movie) విషయంలోను అదే జరుగుతుందేమో? అనే భయంతో ఉన్నారట. అందుకే ఇప్పటి వరకు ఓటిటి బిజినెస్ జరుపుకోలేదని అంటున్నారు. పైగా నిర్మాతలు 75 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. అందుకే ఓటిటి సంస్థలు వెనక్కి తగ్గాయని అంటున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఈ మధ్య కేరళ స్టోరీ ఈ నెల 23న జీ 5లో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరగడం విశేషం.