Meenakshi Lekhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి మండిపడ్డారు. ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిట్ బృందం అతనిని 12 గంటలపాటు విచారించిందని తెలిపారు. నిజాయితీపరులు ఎప్పుడూ కూడా దర్యాప్తు బృందాలకు సహకరిస్తారని, భయపడి పారిపోరని ఆమె అన్నారు. తప్పు చేసిన కేజ్రీవాల్ వంటివాళ్లే తప్పించుకు తిరుగుతారని ఆమె ఆరోపించారు. మహామహులపైనే దర్యాప్తు జరిపిన సంస్థలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఓ లెక్కా అని ఆమె వ్యాఖ్యానించారు.
ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ 5 సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవడానికి కారణమేంటని మీనాక్షి ప్రశ్నించారు. అరెస్టు చేస్తారన్న భయంతోనే కేవలం ఈడీ కార్యాలయానికి వెళ్లడం లేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ విధానం ఓ భారీ మోసం. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఇసుమంతైనా లేదని మీనాక్షి అన్నారు.