సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. ప్రతేడాది ఏదో ఒకటి సామాన్యులను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఓ సారి ఉల్లి ..మరో సారి టమోటా..ఈ సారి వెల్లుల్లి వంతు వచ్చింది.
Garlic: సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. ప్రతేడాది ఏదో ఒకటి సామాన్యులను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఓ సారి ఉల్లి ..మరో సారి టమోటా..ఈ సారి వెల్లుల్లి వంతు వచ్చింది. రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వంటల్లో అల్లం, వెల్లుల్లి తప్పనిసరి. లేదంటే ఆ కూర రుచిగా ఉండదు. కానీ, ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ. 500పైనే ఉంది. దీంతో వంటి గదిలోకి వెల్లుల్లి తేవాలంటే మగాళ్లు జంకుతున్నారు. అది లేకుండా వంట చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు మన ఆడలేడీస్.
డిసెంబరులో రిటైల్ మార్కెట్లలో వెల్లుల్లి కిలో రూ 350 నుంచి రూ. 400 ఉండగా.. హోల్ సేల్ మార్కెట్లో అత్యంత నాణ్యమైన వెల్లుల్లి రూ 250 పలికింది. కానీ, ప్రస్తుతం ఇది మరింత పెరిగింది. ఏకంగా కిలో రూ.500 దాటేయడం గమనార్హం. వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో మార్కెట్లలోకి సరఫరా అంతంతమాత్రంగా ఉంది. డిమాండ్‌కు తగిన సప్లై లేకపోవడంతో వెల్లుల్లి ధర పెరుగుతోంది. వెల్లుల్లి సాగు ఖరీఫ్, రబీ సీజన్లలో జరుగుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో జూలైలో వేసిన పంట నాశనమైంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మార్కెట్లో వెల్లుల్లిపై పడింది. భారత్‌లోని మొత్తం వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు 40శాతం వాటా మహారాష్ట్రదే. కొత్త పంట వచ్చేవరకు వెల్లుల్లి ధర ఇంతే. మరో రెండు నెలల పాటు కొత్త పంట కోసం ప్రజలు ఎదురుచూడాల్సిందే. వాతావరణ మార్పులతో పాటు అకాల వర్షాలు కూడా ఈ వెల్లుల్లి రేట్లకు రెక్కలు తెస్తున్నాయి.