సికింద్రాబాద్లోని ఎలక్ట్రిక్ షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో బైక్ షోరూం పైనే ఉన్న లాడ్జిపైకి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. లాడ్జిలో దట్టమైన పొగలు అలుముకోవడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరంతా కూడా 35 నుంచి 40 ఏళ్ల లోపు వారు అని తెలుస్తోంది. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు.
మృతి చెందిన వారిలో విజయవాడకు చెందిన ఎ.హరీశ్, చెన్నైకు చెందిన సీతారామన్, ఢిల్లీ వాసి వీతేంద్ర గా గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.