సరిగ్గా వారం రోజుల్లో మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. మూవీ లవర్స్ అంతా సలార్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సలార్ పై ఓ హీరో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఈ హీరో గురించి తెలుగోళ్లు గొప్పగా చెప్పుకునే స్థాయి లేదు కానీ.. సలార్ పై కామెంట్స్ చేయడంతో కాస్త మాట్లాడుకోవాల్సి వస్తోంది. డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ ‘డంకీ’, డిసెంబర్ 22న ప్రభాస్ ‘సలార్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు భయపడి ఆ వారంలో మరో సినిమా రిలీజ్ అవడం లేదు. చేస్తే వారం ముందుకో, వెనక్కో విడుదల చేసుకుంటున్నారు. ఓ కన్నడ హీరో కూడా సలార్ రిలీజ్ అయిన వారం తర్వాత తన సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. అతనెవరో కాదు.. కన్నడ స్టార్ హీరో డీ బాస్ దర్శన్. ఈయన ‘కాటేరా’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు.
తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘ఆ సినిమాల గురించి మనం ఎందుకు భయపడాలి. ఇది మన గడ్డ, మనతో పోటీ పడాలంటే వాళ్లు భయపడాలి.. అయినా కాటేరా మనోళ్ల కోసం ఇక్కడి థియేటర్ల కోసం తీసిన సినిమా’.. అంటూ కామెంట్స్ చేసాడు. దీంతో దర్శన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ భాష, ఆ భాష అని కాకుండా అన్ని భాషల్లోను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
అలాంటప్పుడు ఇది మన సినిమా, మన గడ్డ అనడం ఏంటి? దర్శన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా మాట్లాడడా? లేదంటే కావాలనే అన్నాడా? అనేది పక్కన పెడితే.. ఈ ఇతని పై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. నీకు దమ్ముంటే.. వారం తర్వాత ఎందుకు? డిసెంబర్ 22నే సలార్‌కు పోటీగా కాటేరా సినిమాను రిలీజ్ చెయ్యాల్సింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. దర్శన్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలానే చేశాడు. కాబట్టి.. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని అంటున్నారు సినిమా వాళ్లు.