రెబల్ స్టార్ ప్రభాస్ అనగానే మనకి గుర్తొచ్చేది కేవలం బాహుబలి, సలార్…ఇలా. అఫ్కోర్స్….రాధేశ్యామ్, ఆదిపురుష్ కూడా గుర్తుకి రాకమానవు. కానీ విజయాల మోతాదులో రాధేశ్యామ్ అండ్ ఆదిపురుష్ సోదిలో కూడా లేకుండా పోయాయి. కానీ ఈ సినిమాలు ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్‌ని వాడుకుందామనే తాపత్రయాన్ని బాగా ఎత్తి చూపిస్తాయి. కానీ ఫలితం వరకూ వస్తే బండ సున్నాయే మిగిలింది. ముఖ్యంగా ప్రభాస్ ఏ మాత్రం కాలర్ ఎగరేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎంతసేపూ ప్రభాస్ పేరు చెప్పగానే భారీ వ్యవహారం, వందల కోట్ల ఖర్చు, వరల్డ్ వైడ్ బిజినెస్, లాభమైనా నష్టమైనా సరే గుండె చెరువైపోతుంది. కాకపోతే ఓటీటిలు కొంతవరకూ కాపాడుతున్నాయి కాబట్టి సరిపోతోంది.
దీనివల్ల ప్రభాస్‌కి కూడా విపరీతమైన ఒత్తిడి. అన్నీ భారీగా ఉండి, కథలు కూడా బిర్రబిగుసుకుపోయి, ప్రభాస్‌ని చెట్టుకి కట్టి కొడుతున్నట్టుగా తయారయ్యాయి. ప్రభాస్‌ని మరో విధంగానే ఆలోచించలేకపోతున్నారు. దర్శకరచయితలు సాదాసీదా కథ రాసుకొస్తే నిర్మాతలు అవతలకి పొమ్మనేంతగా ప్రభాస్ ఇమేజ్ ముదిరిపోయింది. ఈ ఉక్కుచట్రం నుంచి ప్రభాస్ తప్పించుకోలేకపోతున్నాడు. ఆ గ్రేట్ ఎస్కేప్‌కి ఏ దర్శకుడు, ఏ నిర్మాత ప్రభాస్‌కి చేయూతనివ్వడం లేదు. ప్రభాస్ చూస్తే ఆకాశంలో ఉన్నాడు, మరో విధమైన లైటర్ వెయిన్ కథ రాయడానికి దర్శకరచయితలకు సాహసం సరిపోవడం లేదు.
అదిగో అటువంటి టైంలోనే దర్శకుడు మారుతీ ప్రభాస్ ఉక్కు సంకెళ్ళను తెంచేశాడు. అయితే అది మళ్ళీ ప్రభాస్ ఛాయిసే. తనే ఎవరు తనని ఈ భారీ కథల బారి నుంచి రక్షించగలిగే మాంత్రికుడు ఎవరని ఆలోచించుకుంటే మారుతి తప్పితే ప్రభాస్ దృష్టికి మరొకడు రాలేదు. తనదైన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్న మారుతీ ఎప్పుడు స్వర్గానికి నిచ్చెనలు వేయలేదు. తాను ఊహించుకోగలిగే కథల స్థాయిని దాటి పరిగెత్తి పాలు తాగడానికి మారుతీ ఎప్పుడూ మొగ్గు చూపించలేదు. కానీ ఇది ప్రభాస్ సూచన. ప్రేమకథాచిత్రంలా ఓ హారర్ ఫాంటసీ చేస్తే తనకి కొంచెం రిలీఫ్ వస్తుందని ప్రభాసే పట్టుబట్టాడు. అప్పుడే మారుతీ కలం పరుగులు తీసింది. వినగానే ప్రభాస్ మనసులో కలకలం రేగింది. వెంటనే ఒప్పేసుకున్నాడు. ఇంత హంగామాని హేండిల్ చేయాలంటే సాధారణ నిర్మాతలు సరిపోరు. ఆ దమ్ము, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉన్న నిర్మాత కావాలి. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు అగ్రనిర్మాత టిజి విశ్వప్రసాద్. ప్రభాస్ అంతటి హీరో కూడా విశ్వప్రసాద్నే హీరోలా ఫీలయ్యాడని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభాస్‌కి ఇటీవల చెప్పుకోదగ్గ హిట్ పడకపోగా ఆతని ఇమేజ్ కోటకి బీటలు పడేట్టు వచ్చాయి సినిమాలు, ఒక్క కల్కి మాత్రమే ప్రభాస్ మార్కెట్‌ని గానీ, ఇమేజ్‌ని గానీ కాపాడింది. కుడోస్ టు నాగ అశ్విన్ అండ్ అశ్వనీదత్.
రాజాసాబ్ సినమాని విశ్వప్రసాద్ టేకప్ చేసిన నాటికి కల్కి రిలీజ్ కాలేదు. అదీ ప్రొడక్షన్లోనే ఉంది. కాబట్టి కల్కి సినిమా సక్సెస్ విశ్వప్రసాద్‌ని ప్రభావితం చేయడానికి ఆస్కారం లేదు. కేవలం మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ మీద నమ్మిక మాత్రమే విశ్వప్రసాద్‌ని ముందుకు నడిపించాయి.
ఇదిలా ఉండగా, ప్రభాస్ కోరుకున్నది జరిగింది. మారుతీ ఇంద్రజాలంతో పుట్టిన కథలో ప్రభాస్ పాత్ర ఆడుతూ పాడుతూ, గెంతుతూ, తుళ్ళుతూ, పాటలు పాడుతూ, ముగ్గురు హీరోయిన్లు మాంచి సందడిగా జరిగింది రాజాసాబ్ షూటింగ్, అందుకే ప్రభాస్ రాజాసాబ్ సెట్‌కి వెళ్ళినప్పుడల్లా జీరో స్ట్రెస్‌లో తనని తాను ఎంజాయ్ చేసుకోగలిగాడని ప్రభాసే చెప్పుకున్నాడు.
అయితే మొన్నటి వరకూ రాజాసాబ్ గురించి ఏ వార్తా ఎక్కడా పొక్కలేదు. ఏం జరుగుతోందో ఏమీ ఎవ్వడికీ తెలియదు. ఏ ఆర్భాటం లేకుండా షూటింగ్ కార్యక్రమాలు చాలా గుంభనంగా జరుగుతూ వచ్చాయి. ఇద్దరికి పబ్లిసిటీ అక్కర్లేదు. ఒకరికేమో పబ్లిసిటీయే అక్కర్లేదు. ఆ ఇద్దరు దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్. పబ్లిసిటీయే అక్కర్లేనిది ప్రభాస్. కానీ ఒక్కసారిగా మొన్న రాజాసాబ్ టీజర్ అవుట్ అవగానే ఔటు పేలినట్టు పేలింది. అది ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఇందులో అతిశయోక్తి లేనేలేదు. నార్త్ టు సౌత్ దద్దరిల్లిపోయింది. బాలీవుడ్ మీడియా గానీ, తమిళ్ మీడియా గానీ, కన్నడ, మళయాళ మీడియా గానీ గడిచిన 48 గంటల్లో రాజాసాబ్ అండ్ ప్రభాస్ న్యూస్‌తో వీర విజృంభణ చేసింది.
ఈ మధ్య రోజుల్లో ఇంత హడావుడి జరిగిన సినిమాయే లేదు. విమర్శలు గుప్పించినవారంతా తలకిందులైపోయారు. గొంతులో వెలక్కాయ పడినట్టయింది అందరికీ. ప్రభాస్, మారుతి, విశ్వప్రసాద్ ఇచ్చిన స్ట్రోకు చాలా స్ట్రాంగ్‌గా తగిలింది ఇండియన్ మీడియాకి. ఒక్కసారిగా. హఠాత్తుగా ఓటిటి వీరులు రైట్స్ కోసం గుర్రాలెక్కి విశ్వప్రసాద్ కోటవైపుకి దౌడు తీశారు. ఎప్పుడైనా నిశ్శబ్దం ప్రమాదమే సుమా!