ఎంత పెద్ద హీరోకైనా సరే దర్శకుడే దిక్సూచి, నిర్మాత దేవుడు. అలా అనుకున్న పెద్ద తరం హీరోలందరూ లాంగ్ కెరీర్స్‌ని కొనసాగించగలిగారు. పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలిగారు. నేనే గొప్ప అనుకుంటే కుదిరే లోకం కాదు చిత్ర పరిశ్రమ. ఎంత గొప్పవాడైనా హీరో జీవితానికి దిశానిర్దేశం చెయ్యగలిగేది దర్శకుడు, నిర్మాతే. ఉదాహరణకి సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ అయిన తర్వాత మెగాస్టార్ అంతటి హిమాలయన్ హీరో కూడా అనిల్ రావిపూడి సినిమాని ఆఘమేఘాల మీద ప్రారంభించారు. ఎందుకంటే అనిలైతే అంత పెద్ద హిట్ ఇవ్వగలడనే ఓ నమ్మిక ఏర్పడింది ఆయన మనసులో. అంతకు ముందు కూడా విశ్వంభర చిత్రానికి సైన్ చేసేముందు వశిష్ట బింబిసార లాంటి అతిపెద్ద హిట్ ఇచ్చాడు. దాంతో క్రమంలో ఉన్న కళ్యాణ్ కృష్ణ చిత్రాన్ని పక్కకు పెట్టి మరీ మెగాస్టార్ వశిష్టకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది.
అయితే రాజాసాభ్ విషయంలో జరిగింది పూర్తిగా విభన్నం. విలక్షణం. దీనికి ముందు మారుతికి చెప్పుకోదగ్గ పెద్ద హిట్ లేదు. పైగా పక్కా కమర్షియల్ లాంటి పెద్ద డిజాస్టర్ ఉంది. నిర్మాతగా విశ్వప్రసాద్ ఫ్లాపులతో ఫైట్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ బిగుసుకుపోయే కథలతో విసిగిపోయి ఉన్నాడు. కష్టపడి చేయడం తర్వాత అయ్యో అనుకోవడం వంటి ఓ సీరీస్ నడించింది ప్రభాస్‌కి. కల్కి ప్రభాస్ హిట్‌గా కన్నా కూడా నాగ అశ్విన్ హిట్ గానే ఎక్కువగా నమోదైంది. ప్రభాస్ సినిమా పదికీ, పరకకీ అయ్యేది కాదని ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఎకనామిక్స్. అయితే అయింది. ఎవరో ఒకరు వచ్చి డబ్బులు మూటలు పెడతారు. అది కూడా ఓకే. కానీ కథలో తన క్యారెక్టర్ లైటర్ వెయిన్‌లో ఉండాలి, అన్ని హంగులూ ఎలాగూ ఉంటాయి. కాస్తంత రొమాన్స్, మరికాస్త తాను చేసే ఎంటర్టైన్మెంటూ ఇవన్నీ ఉంటే బావుణ్ణని అనుకున్న ప్రభాస్ కలని దర్శకుడు ఒక్కడే పండించగలడు అని ప్రభాస్ నమ్మడమే ఇక్కడ పెద్ద మేజిక్. హిట్ లేకపోయిన మారుతి దగ్గర క్రియేటివ్ హీట్ ఉందనే కీలకమైన నిజాన్ని ప్రభాస్ గ్రహించాడు. అందుకే హారర్ ఫాంటసీ ప్రపోజల్ తీసుకొచ్చింది స్వయంగా ప్రభాసే కావడం ఇందులో హైలైట్. పైగా ఏ భాషా చిత్రమైనా సరే అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ హారర్ ఫాంటసీలని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ బాగానే అర్ధం చేసుకున్నాడు.
ప్రభాస్ అయితే అనుకున్నాడు గానీ, మరీ ఇంత బాగా కట్ చేయగలుగుతాడు మారుతీ అని డెఫినెట్‌గా అనుకుని ఉండడు. కానీ, మారుతీ ఊహించనిది చేసి చూపించాడు. పైగా బంగారంలాంటి నిర్మాత దేవుడిచ్చిన వరంలా దొరకడం రాజాసాబ్ చిత్రానికి ఆయువుపట్టు. ఎందుకంటే విశ్వప్రసాద్‌కి ముందు మరెవరో నిర్మాత దగ్గరికి ఈ ప్రాజెక్టు వెళ్ళిందట. కానీ బాబోయ్ నాకొద్దు అని దణ్ణం పెట్టేశాడంట ఆ సదరు నిర్మాత. ఎందుకంటే రాజాసాబ్ నిర్మించడానికి మామ్మూలు గట్స్ సరిపోవు. కనిపించేంత అందమైనది కాదు సినిమా వ్యాపారం. ఇందులో ఉండేన్ని వైకుంఠపాళీలు మరే పరిశ్రమలోనూ ఉండవు. వాటిని అన్నిటినీ తట్టుకుని విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడమే సినిమా భవిష్యత్తు దెబ్బకి మారిపోయింది. ఈ మధ్యనంతా ప్రభాస్ చేసిన సినిమాలు చూశాం కదా. అన్నీ కరడుగట్టిన కథలు. కూసంతైనా కళాపోషణ లేకుండా ప్రభాస్ గుండె ఎడారిలా మారిపోయే కథలే. అందుకే అన్నీ బావుంటే బ్రో నాకిద్దరు హీరోయిన్లని పెట్టమని మారుతీని రిక్వెస్ట్ చేసుకున్నాడు ప్రభాస్. ఇద్దరేం ఖర్మ నీ రేంజ్‌కి అని మారుతీ ముగ్గురు హీరోయిన్లని కానుకగా ఇచ్చాడు ప్రభాస్‌కి. ఆటపాటకి ఏమాత్రం లోటు లేదనమాట. టీజర్ చూస్తే ఆ ప్యాలెస్ కళ్ళు చెదరగొట్టింది. మారుతికి ఇంత క్రియేటివిటీ ఉందా అని అందరూ విస్తుపోయేంతగా మారుతీ ఓ ప్రపంచాన్నే సృష్టించేశాడు. క్రియేటివిటీ ఉంటే సరిపోదు, దాన్ని సపోర్ట్ చేసే నిర్మాత గట్స్ కూడా ఇక్కడ చాలా ప్రధానం. ఆ స్టామినా ఉన్న విశ్వప్రసాద్ దొరకడం కూడా ఇక్కడ ఒక అదృష్టం.
మారుతీ పుణ్యమా అని ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ హీరోతో జత కట్టే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మాళవికా మోహనన్ ఎక్స్ వేదికగా తన ఆవేశాన్ని వెలిబుచ్చింది. ప్రభాస్‌ని తెగ మెచ్చేసుకుంది. ఎందరికొస్తుందీ ఇటువంటి అవకాశం? అందుకే అమ్మడు తెగ మురిసిపోతోంది. కానీ, దీని వెనుక మారుతీ కాయకష్టం, విశ్వప్రసాద్ వ్యయప్రయాసలు మామ్మూలివి కావు.