ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏజెన్సీలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Ambulance : ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏజెన్సీలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సిచ్యుయేషన్ గనుక తలెత్తితే.. గర్భిణులకు చాలా ప్రమాదకరం. పురుటి నొప్పులతో ఆ రోడ్లు దాటడం సాధ్యం కాదు. అంతటితో పాటు అక్కడి ఎలాంటి వాహనాలు రావు. పొరపాటుగా వస్తే అందులో కూరుకుపోవాల్సిందే. తాజాగా అలాంటి ఘటనే ఏటూరునాగారం ఏజెన్సీలో చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణీ పురిటి నొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. దీంతో బిడ్డ కడుపులోనే మృతి చెందింది. ఏటూరునాగారం మండలం రాంనగర్ నుంచి కమలాపురం వెళ్లే మార్గంలో గర్భిణిని తీసుకెళ్తున్న 108 వాహనం బురదలో కూరుకుపోయింది. దీంతో స్థానికులు ట్రాక్టర్ సహాయంతో అంబులెన్స్‌ను బయటకు తీశారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు పనులు నిలిచిపోయాయి. దీంతో రోడ్డు బురదమయంగా మారింది. ఈ క్రమంలో కోయగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనిగంటి రమ్య తీవ్ర నొప్పులతో బాధపడుతుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యమైంది. దీంతో కడుపులో ఉన్న శిశువు ఉమ్మ నీరు మింగి మృతి చెందింది. అయితే రోడ్డు బురదమయంగా లేకుంటే అంబులెన్స్ అందులో ఇరుక్కుపోయి ఉండేది కాదని.. తమ పాప బతికేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లు గడిచినా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.