4 Indians On The List Of Forbes Most Powerful Women
Forbes Most Powerful Women: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ (Forbes) విడుదల చేసింది. ఇందులో నలుగురు భారతీయ మహిళలు ఉన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) 32వ స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్నీ నడార్ మల్హోత్రా 60వ స్థానంలో నిలిచారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో ఉన్నారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా (kiran) 76వ స్థానం దక్కించుకున్నారు. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టీన్ లగార్డ్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
2019 మే నెలలో ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆమె నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు యూకేలో అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్, బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో కీలక పాత్ర పోషించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నిర్మలా సీతారామన్ సేవలు అందించారు. హెచ్‌సీఎల్ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నడార్ కూతురు రోష్ని నడార్ 2020 జూలై నుంచి కంపెనీకి చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఆ సంస్థను ముందుకు నడిపిస్తున్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. సెయిల్ చైర్ పర్సన్ మోండల్.. 2021లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలో కంపెనీ లాభాలు మూడు రెట్లు పెరిగాయి. కంపెనీ ఆర్థికవృద్ధి సాధించిందని ఫోర్బ్స్ తెలిపింది. బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్ వ్యవస్థాపకురాలు మజుందార్ షా స్వయంగా ఎదిగారని ప్రశంసలు కురిపించింది.