»Nasa Joined Hands With Isro Launched The Most Expensive Satellite In The World
ISRO: ఇస్రోతో చేయి కలిపిన నాసా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాటిలైట్ ప్రారంభం
ఇస్రో, నాసా చేతులు కలిపి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమయ్యాయి. నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి రెండూ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ఆ శాటిలైట్ మానవాళిని రక్షిస్తుందని నాసా డైరెక్టర్ లారీ లెషిన్ వెల్లడించారు.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO)తో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) చేయి కలిపింది. భారత్-అమెరికా సంయుక్తంగా ఓ మిషన్ను చేపట్టనున్నట్లు నాసా ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ ప్రయోగాన్ని నిర్వహించనుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ మిషన్ను (Earth Imaging sattelite Mission) ఈ రెండు దేశాలు కలిసి ప్రయోగించనున్నాయి. ఈ విషయాన్ని నాసా డైరెక్టర్ లారీ లెషిన్ (Lorry Lesian) మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా చంద్రయాన్3 (Chandrayan3) ప్రయోగంపై కూడా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.
భూకంపాలు, సునామీల వంటి ప్రమాదాలను అంచనా వేసేందుకు నాసా, ఇస్రో చేపట్టే నిసార్ ప్రయోగం సహాయపడనుంది. నిసార్ (NISAR) అనేది నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన శాటిలైట్ కావడం విశేషం. ఈ భూ కక్ష్య అబ్జర్వేటరీ శాటిలైట్ భూమిని 12 రోజుల్లోనే మ్యాప్ చేస్తుంది. అంతేకాకుండా భూగ్రహంపై పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, సముద్రమట్టం పెరుగుదల, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాల మార్పులను అర్థం చేసుకునేందుకు కచ్చితమైన డేటాను అందించనుంది.
నిసార్ (NISAR) ఉపగ్రహం సామాన్యుల జీవితంలో పెను మార్పును తెస్తుందని లారీ లెషిన్ అన్నారు. ఇంకా ఆమె ఈ మిషన్ గురించి మాట్లాడుతూ..మంచు ఫలకాలు కరగడం, అడవులను మార్చడం, భూకంపాలు, అగ్నిపర్వతాల గురించి అన్ని రకాల డేటాను ఈ శాటిలై్ అందిస్తుందన్నారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కూడా ఈ శాటిలైట్ అంచనా వేస్తుందని ఆయన వెల్లడించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో దీని సాయం మరింత పెరుగుతుందని తెలిపారు.
40 మంది ఇంజనీర్లు బెంగళూరులో 9 నెలలుగా దీనిపై పనిచేస్తున్నామని, అలాగే కాలిఫోర్నియాలోని నాసా జేపీఎల్ రాడార్లో ఇక్కడి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పనిచేస్తున్నారని తెలిపారు. మొత్తంగా రెండు దేశాల శాస్త్రవేత్తల బృందాలు కలిసి పనిచేస్తున్నాయని లెషిన్ వెల్లడించారు. చంద్రయాన్3 తర్వాత ఇస్రోపై తమకు మరింత గౌరవం పెరిగిందన్నారు. నాసా, ఇస్రో మధ్య మరిన్ని భాగస్వామ్యాలు రాబోయే రోజుల్లో ఉంటాయన్నారు.