»The Ongoing War Has Killed More Than 9800 People So Far
Israel-Hamas War: కొనసాగుతోన్న యుద్ధం.. ఇప్పటి వరకూ 9,800 మందికిపైగా మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇప్పటి వరకూ 9,800 మందికిపై దుర్మరణం చెందారు. అందులో 4 వేల మంది వరకూ చిన్నారులు ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది గాయాలపాలయ్యారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Israel-Hamas War) ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై దాడులు చేస్తోంది. వారం రోజులుగా గాజాపై భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి సైతం ముందుకు రావడం లేదు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ 9,800 మందికి పైగా దుర్మరణం చెందారు. అక్టోబర్ 7వ తేదిన ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడులు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మూడు వారాలుగా ఈ దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ యుద్దంలో వేలాది మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. హమాస్ దాడి తర్వాత 1400 మంది ఇజ్రాయిలీలు మృతిచెందారు. అలాగే గాజాపై గత కొద్ది రోజుల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అటు వైమానిక దాడులు, ఇటు భూతల దాడులను ఇజ్రాయెల్ చేయడంతో పాలస్తీనాలోని 8400 మంది దుర్మరణం చెందారు. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు ప్రేరేపించిన నిసాం అబు అజిన్ యుద్ధ విమానాల దాడిలో మృతిచెందినట్లుగా ఐడీఎఫ్, ఐఎస్ఏ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రకటించాయి.
మిలిటెంట్ గ్రూప్ యూఏవీ డెవలప్మెంట్లో ఈ హమాస్ బెటాలియన్ కమాండర్ అయిన నిసాం అబు అజిన్ కీలక పాత్ర పోషించాడు. ఐడీఎఫ్ భూతల దాడులను ఆపే ప్రయత్నంలో ఈ కమాండర్ చనిపోవడంతో హమాస్ ఉగ్ర సంస్థకు గట్టి దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంలో ఇప్పటి వరకూ 4 వేల మంది వరకూ పిల్లలు చనిపోయినట్లు ఆ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.