»Shock For 81 5 Crore Indians Center Alerted After Data Leak
Data Leak: 81.5 కోట్ల మంది భారతీయులకు షాక్..డేటా లీక్ అవ్వడంతో అప్రమత్తమైన కేంద్రం
భారతీయుల డేటా హ్యాక్ అయ్యింది. అది కూడా 80 కోట్ల మందికి పైగా డేటా లీక్ కావడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఐసీఎంఆర్ నుంచి ఈ డేటా లీక్ అవ్వడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. దేశంలోనే ఇప్పటి వరకూ జరిగిన డేటా లీక్ ఘటనల్లో ఇదే అతి పెద్దది కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టాయి.
టెక్నాలజీ (Technology) పెరుగుతున్న కొద్దీ వాటిని దుర్వినియోగం చేయడం కూడా ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీని వినియోగించి సైబర్ నేరాలు (Cyber Crimes) పెరుగుతున్నాయి. తాజాగా ఐసీఎంఆర్ (ICMR) వద్ద ఉన్నటువంటి 81.5 కోట్ల మంది భారతీయుల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది. ఇండియన్స్ డేటా ఇలా లీక్ (Data Leak) కావడం సంచలనం రేకెత్తించింది. దేశంలోనే ఇప్పటి వరకూ జరిగిన డేటా లీక్ ఘటనల్లో ఇదే అతి పెద్ద హ్యాకింగ్ (Hacking) కావడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ డేటా లీక్ (Data Leak) ఘటనపై ఫోకస్ పెట్టాయి. హ్యాకర్స్ ఈ డేటాను గ్రే మార్కెట్లో అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. అసలు హ్యాకర్స్ (Hackers) వద్ద ఉన్న డేటా అసలైందేనా అనే సందేహాలుంటే చెక్ చేసుకోవాలని హ్యాకర్లు లక్ష మంది డేటాను శాంపిల్‌గా వెల్లడించారు. వాటిని ఐసీఎంఆర్ అధికారులు చెక్ చేశారు. దీంతో హ్యాకర్స్ వద్ద ఉన్న డేటా నిజమైందేనని గుర్తించారు. దీంతో డేటా చోరీపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఐసీఎంఆర్ ఫిర్యాదు చేసింది.
చోరీ అయిన ఆధార్ డేటా (Adhar data) ఎక్కడి నుంచి లీక్ అయ్యిందో తెలియడం లేదని, వాస్తవానికి కోవిడ్19 డేటా కేంద్ర ఆధీనంలో ఉన్న ఎన్ఐసీ, ఐసీఎంఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు వెళ్తుందని అధికారులు తెలిపారు. ఈ డేటా లీక్ కావడంతో డాక్టర్ల పర్సనల్ లాగిన్ ఆధారాలు, వినియోగదారులు పేర్లు, వారి పాస్వర్డ్స్ లీక్ అయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అలాగే పాస్ పోర్టులు, ఫోన్ నెంబర్లతో పాటు గోప్యంగా ఉంచిన సమాచారం అంతా కూడా లీక్ అయినట్లుగా అధికారులు గుర్తించారు.
2022 ఫిబ్రవరి నెల నుంచి ఐసీఎంఆర్ డేటా బేస్‌పై అనేకసార్లు సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు ఆ డేటాను రూ.66 లక్షలకు విక్రయించేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో జార్ఖండ్ లోని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ హ్యాక్ చేయబడిన విషయాన్ని అప్పట్లోనే సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. 3.2 లక్షల మందికి పైగా రోగుల రికార్డులను అప్పట్లోనే హ్యాకర్లు విడుదల చేయడం కలకలం రేపింది.