»Violent Agitations For Maratha Quota Internet Cut In Beed
Maratha Reservations: ‘మరాఠా కోటా’ కోసం హింసాత్మక ఆందోళనలు..బీడ్లో ఇంటర్నెట్ కట్
మరాఠా రిజర్వేషన్ల కోసం చేపడుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. హింసాత్మక ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆంక్షలు విధించడమే కాకుండా ఇంటర్నెట్, రవాణా సేవలను నిలిపివేశారు.
మరాఠా కోటా కోసం చేపడుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు (Maratha Reservations) కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న చేపట్టిన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మహారాష్ట్ర (Maharashtra)లోని బీడ్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధిస్తూ కఠిన చర్యలు చేపట్టారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బీడ్ నగరం నుంచి రవాణా వ్యవస్థలన్నింటినీ రద్దు చేశారు. వ్యాపారాలు జరగకుండా మాల్స్, షాపులు, దుకాణాలను ఎక్కడికక్కడ మూసివేయించారు.
బీడ్ లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై నిరసనకారులు దాడి చేపట్టారు. ఆయన ఇంటికి నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఇల్లు మొత్తం దగ్ధమవ్వడంతో పరిస్థితి తీవ్రం అయ్యింది. మంగళవారం కూడా ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటం వల్ల పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ చర్యలు చేపట్టారు. ముఖ్యమైన ప్రదేశాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడమేకాకుండా బయటికి వచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.
వందలాది మంది నిరసనకారులు బీడ్ నగరంలోని బస్ డిపోలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. దీంతో బస్ డిపోలో కంట్రోట్ క్యాబిన్ పూర్తిగా ధ్వసం అయ్యింది. డిపోలో నిలిపి ఉంచిన 53 బస్సులను నాశనం చేశారని రవాణాశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. బస్సును నిప్పంటించే ప్రయత్నంలో రవాణా శాఖ సిబ్బంది నిరసనకారులను అడ్డుకున్నారు. దాదాపు వెయ్యి మంది డిపోలో ఆందోళన చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆందోళనలకు పాల్పడిన 55 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ 12 కేసులు నమోదయ్యాయని, ఆందోళనతో సంబంధం ఉన్న మరో 300 మందిని గుర్తించి విచారిస్తున్నట్లుగా బీడ్ ఎస్పీ నందకుమార్ వెల్లడించారు. మరాఠా ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని గత కొన్ని రోజులుగా పలువురు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వారి రిజర్వేషన్లకు అనుకూలంగా మనోజ్ జరంగే నిరాహార దీక్ష చేపట్టగా ఆ దీక్షపై సోమవారం కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.