»Key Announcement Of Election Commission Ban On Exit Polls In 5 States
Election Commission: ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన..5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30వ తేది వరకూ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది. అలాగే రాజకీయాలతో సంబంధం లేని వారి డబ్బులు సీజ్ చేసి ఉంటే వెంటనే వాటిని తిరిగి ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ఎలక్షన్ కమిషన్ (EC) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక వేసింది. అలాగే తాజాగా మరో కీలక విషయాన్ని ఈసీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఈసీ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. నవంబర్ 7వ తేది నుంచి 30వ తేది సాయంత్రం 6.30 గంటల వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ వెల్లడించింది.
ఇకపోతే తెలంగాణ (Telangana)లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను ఈసీ (EC) అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు చూపించినా కూడా చిన్న చిన్న కారణాలు చెప్పి నగదును పోలీసులు సీజ్ చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా సీజ్ చేసిన నగదు ఇప్పటి వరకూ రూ.140 కోట్లకు చేరింది.
వాస్తవానికి రాజకీయాలతో (Politics) సంబంధం లేని వ్యక్తులు తమ సొంత అవసరాలకు, ఇతర ఖర్చులకు నగదును తీసుకెళ్తున్న సందర్భంలో పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు. ఆ నగదుపై ఈసీ (Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. సొత్తు నిబంధనల ప్రకారం ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయాలతో సంబంధం లేనివారికి ఆ నగదును వెంటనే ఇచ్చేయాలని సూచించింది. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సీనియర్ డిప్యూటీ కమిషనర్ నీతీష్ కుమార్ వ్యాస్ తెలిపారు.
త్వరలో నామినేషన్లు ప్రారంభం కానున్న తరుణంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచన చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఎక్కడా రాజీపడొద్దని, ఎవ్వరినీ ఉపేక్షించొద్దని పోలీసులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.