CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దూసుకెళ్తున్నారు. రోజుకు కనీసం రెండు, మూడు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తీరును ఎండగట్టారు. తనపై, పార్టీపై అభాండాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. తుమ్మల గురించి కేసీఆర్ ఏమన్నారంటే..
‘మిత్రుడు తుమ్మల ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో ఉన్నాడు. స్నేహితుడు కదా అని.. తాను పిలిచి మంత్రి పదవీ ఇచ్చాను. మంత్రిమండలిలో ఉండాలంటే విధానసభ, లేదంటే పరిషత్లో సభ్యుడు కావాలి.. అందుకోసమే ఎమ్మెల్సీ చేశాను. ఆ తర్వాత తన నియోజకవర్గం రిజర్వ్ అయ్యిందని చెప్పడంతో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాను. ఇక్కడ ప్రచారం చేసి 40 వేల పైచిలుకు ఓట్లతో గెలిచేందుకు ప్రతీ ఒక్కరు కష్టపడ్డారు. అలాంటి పార్టీకి తుమ్మల చేసిందేమీ లేదు. గుండు సున్నా.. పార్టీకి ఒక్క సీటు కూడా తీసుకురాలేదు. పైగా తననే మోసం చేశానని అంటున్నారు. ఇంతకీ ఎవరినీ ఎవరు మోసం చేశారు.. మీరు అర్థం చేసుకోవాలి’ అని సభకు వచ్చిన జనాన్ని చూస్తూ కేసీఆర్ (KCR) మాట్లాడారు.
ఎవరు ఎవరిని మోసం చేశారు
మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, పాలేరులో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖమ్మంలో నువ్వు పార్టీకి చేసింది గుండు సున్నా. పైగా నేను మోసం చేశాను అని చెప్పుకుంటున్నాడు – సీఎం కేసీఆర్ pic.twitter.com/ecdmaBZAER
నోరు ఉంది కదా అని.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని కేసీఆర్ సూచించారు. ప్రజా జీవితంలో ఉన్న వారిమి, అబద్దాలు చెప్పొద్దు.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. పాలేరు సభలో ప్రధానంగా తుమ్మలను టార్గెట్ చేశారు. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీలో ఉన్నారు.