భారత అగ్రశ్రేణి ఆటగాడు కేఎల్ రాహుల్ సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన ప్రేయసి మెడలో ముచ్చటగా మూడు ముళ్లు వేయనున్నాడు. వీరి వివాహానికి మహారాష్ట్రలోని ఖండాలలో ఉన్న తనకు కాబోయే మామ సునీల్ శెట్టి ఫామ్ హౌజ్ ముస్తాబైంది. వివాహానంతరం బెంగళూరు, ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. వివిధ రంగాల ప్రముఖులు ఈ వివాహ వేడుకకు తరలిరానున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో కేఎల్ రాహుల్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తరచూ కలుసుకోవడం.. విదేశాలకు వెళ్లడం చేస్తున్నారు. వీళ్లిదరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలైనా ప్రేమ విషయం మాత్రం బయటకు చెప్పలేదు. కానీ 2021లో తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు రాహుల్, అతియా అధికారికంగా ప్రకటించారు. అతియా బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఖండాలలోని ఫామ్ హౌజ్ లో ఇప్పటికే వివాహానికి ముందస్తు కార్యక్రమాలు మొదలయ్యాయి. మెహందీ, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నాయి. కాగా వీరి వివాహానికి కొద్ది మంది సంఖ్యలో మాత్రమే కుటుంబసభ్యులు, బంధువులు, ప్రముఖులు పాల్గొననున్నారని తెలుస్తున్నది. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల కోసం బెంగళూరు, ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. వీటి తేదీలు ఇంకా ఖరారు కాలేదు.