తెలుగు దేశం పార్టీ కార్యకర్తలంతా తమ పిల్లలేనని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న తల్లిని కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరిని (Bhuvaneshwari) కలిసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ‘‘సంఘీభావ యాత్ర’’కు పూనుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ.. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్(Twitter)వేదికగా స్పందిస్తూ…‘‘చంద్రబాబుకి మద్దతుగా రాజమండ్రి(Rajahmundry)లో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి టీడీపీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారు.
బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు (Police) నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కెక్కడిది?’’ అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు.టీడీపీ (TDP) అధినేత చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా జైలులో పెట్టింది.. నిజాయతీగా పోరాడుతున్న నేతను ఇబ్బందులకు గురిచేస్తుంటే పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తారని భువనేశ్వరి చెప్పారు. ఈ క్రమంలో నిజాయతీ వైపు నిలబడ్డ వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తారని ఆమె పేర్కోన్నారు. ఇందులో భాగంగానే పార్టీ శ్రేణులు తనను కలిసేందుకు యాత్ర చేపడితే అడ్డుకోవడమేంటని, తనను కలవొద్దని చెప్పే హక్కు పోలీసులకు ఎక్కడిదని నారా భువనేశ్వరి నిలదీశారు.